KTR : బీఆర్ఎస్ చెప్పిందే నిజమవుతోంది అని కేటీఆర్ (KTR) అన్నారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి తెలంగాణ కొంగుబంగారమైన సింగరేణి సంస్థను ప్రైవేటుకు కట్టబెట్టే కుట్ర అక్షర సత్యమని తేలిపోయింది అని పేర్కొన్నారు. ఇప్పటికే రెండు బొగ్గు బ్లాక్లులను ప్రైవేటుపరం చేసి, ఇప్పుడు ఉన్నతస్థాయి ఉద్యోగాలను కూడా ప్రైవేటుకు కట్టబెట్టడం, ముంచుకొస్తున్న ముప్పుకు మరో ప్రమాద హెచ్చరిక అని అన్నారు. దేశంలోనే వందేళ్ల చరిత్ర కలిగిన తొలితరం ప్రభుత్వరంగ సంస్థను బలోపేతం చేయాల్సింది పోయి నిర్వీర్యం చేసి నీరుగార్చే కుతంత్రాలు కార్మికుల హక్కులకు మరణశాసనాలే.. లాభాల పంట పండించి దేశ విద్యుత్ అవసరాలు తీర్చడంలో మూలస్తంభంలా నిలిచినందుకు సింగరేణి సంస్థకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్.. ప్రైవేటైజేషనేనా అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన సింగరేణిని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జంగ్ సైరన్ మోగిస్తాం. కార్మికుల సంఘటిత శక్తిలో ఉన్న బలాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చవిచూపిస్తాం అని కేటీఆర్ పేర్కొన్నారు.