ప్రభుత్వం తనపై మోపిన ఫార్ములా – ఈ అక్రమ కేసు అంశంలో బంజారాహిల్స్ లోని ఏసీబీ కార్యాలయంలో విచారణకు హాజరుకానున్న సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ X వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. “హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్ తో పాటు తెలంగాణకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకువచ్చేందుకు ప్రతిష్టాత్మక ఫార్ములా ఈని ఎంతో కష్టపడి తీసుకోచ్చాము. ఎలక్ట్రానిక్ వాహన రంగంలో హైదరాబాద్ ను గమ్యస్థానంగా మార్చేందుకే ఫార్ములా – ఈ గొప్ప ఎజెండాతో ముందుకు తీసుకువచ్చాము. తెలంగాణ మొబిలిటీ వ్యాలీలో ఎలక్ట్రానిక్ వాహనాల ఇన్నోవేషన్, రీసెర్చ్ మరియు తయారీ రంగాల్లో పెట్టుబడులు తెచ్చి ఉద్యోగ, ఉపాధి కల్పించాలన్న లక్ష్యంగా పని చేశాము. ఫార్ములా – ఈ సందర్భంగా నిర్వహించిన ఈ – మొబిలిటీ వీక్ ద్వారా 12 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించగలిగాము. నీచమైన రాజకీయాలు చేసే చిన్న మనస్తత్వం కలిగిన నాయకులకు ఈ అంశం అర్థం కాలేదు. కానీ విజ్ఞులైన తెలంగాణ ప్రజలకు ఈ అంశం తెలుసు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ విజన్ ను, నిజాన్ని తెలంగాణ ప్రజలు తప్పకుండా గుర్తిస్తారు. ఎప్పటికైనా సత్యం, న్యాయమే గెలుస్తుంది” అని ఆయన రాసుకొచ్చారు.