ఆర్బీఐ రెపోరేట్‌కు అనుగుణంగా ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ పయనిస్తున్నాయి. ఇండ్ల రుణాలపై వడ్డీరేట్లు 50 బేసిక్ పాయింట్లు పెంచుతున్నట్లు ప్రకటించాయి. గత మే నుంచి ఆర్బీఐ 140 బేసిక్ పాయింట్ల రెపోరేట్ పెంచినప్పటి నుంచి బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ) వడ్డీరేట్లు సవరిస్తున్నాయి.
దీనికి అనుగుణంగా బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ సోమవారం ఇండ్ల రుణాలపై 50 బేసిక్ పాయింట్ల వడ్డీరేటు పెంచింది. దీంతో వేతన జీవులు, వృతి నిపుణుల ఇండ్ల రుణాలపై కనిష్టంగా వడ్డీ 7.70 శాతం వసూలు చేస్తామని తెలిపింది. తాజా వడ్డీరేట్ల పెంపు తర్వాత కూడా పలు ఆర్థిక సంస్థలు, బ్యాంకుల వడ్డీతో పోలిస్తే తక్కువేనని పేర్కొంది.
ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ తన ప్రైమ్ లెండింగ్ రేట్ (ఎల్‌హెచ్‌పీఎల్ఆర్) 50 బేసిక్ పాయింట్లు పెంచేసింది. దీంతో ఇండ్ల రుణాలపై వడ్డీరేటు 7.50 శాతం నుంచి ఎనిమిది శాతానికి పెరిగింది. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ మేనేజింగ్ డైరెక్టర్ కం చీఫ్ ఎగ్జిక్యూటివ్ వై విశ్వనాథ గౌడ్ మాట్లాడుతూ 0.5 శాతం రెపోరేట్ పెంచుతూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం వల్ల నెలవారీ రుణ వాయిదాలు, హోంలోన్ టెన్యూర్‌లపై కనీస ప్రభావమే చూపుతుందన్నారు. సొంతిండ్ల కొనుగోలు దారుల నుంచి గిరాకీ యథాతథంగా కొనసాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.