Homeహైదరాబాద్latest Newsఢిల్లీలో కేజ్రీవాల్‌కు సింపతీ రాలేదా?

ఢిల్లీలో కేజ్రీవాల్‌కు సింపతీ రాలేదా?

దేశ రాజధాని దిల్లీలో బీజేపీ హవా కొనసాగుతోంది. 7 రౌండ్లు ముగిసేసరికి మొత్తం 7 స్థానాల్లో బీజీపీ ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ 3, ఆప్ 4 స్థానాల్లో పోటీ చేశాయి. ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ జైలుకు వెళ్లారు. ఈ క్రమంలో బీజేపీ ప్రచారంలో దూకుడు ప్రదర్శించింది. ఆప్ అవినీతిని ప్రజల్లో ఎండగట్టింది. జైల్ కా జవాబ్ పేరుతో ప్రచారం నిర్వహించిన ఆప్ వ్యూహం బెడిసికొట్టినట్టయింది. దేశం మొత్తం ఎన్నికలు జరుగుతుండగా ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులు ప్రచారంలో మునిగితేలారు. కానీ దిల్లీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్ మాత్రం జైలులో ఉన్నారు. సరిగ్గా ఎన్నికల ప్రచార సమయంలో అక్రమంగా అరెస్టు చేశారని విపక్షాలు మండిపడ్డాయి. చాలామంది బీజేపీని బహిరంగంగానే విమర్శించాయి. అమెరికా, ఫ్రాన్స్, రష్యా వంటి దేశాలు ఈ విషయంలో తలదూర్చగా కేంద్ర ప్రభుత్వం మాత్రం వాటిని తోసిపుచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేజ్రీవాల్‌పై సింపతి పెరిగింది. అధికారంలోకి వచ్చిన నాటినుంచి భిన్న నిర్ణయాలు తీసుకుంటూ దిల్లీని ప్రగతిపథంలో నడిపించారనే పేరు కేజ్రీవాల్‌కు ఉంది. అంతటి స్థాయి, పేరున్న వ్యక్తిని అక్రమంగా జైల్లో పెట్టారంటూ చర్చ జోరుగా సాగింది. ఆప్ నాయకులు కూడా ప్రచారంలో ఈ విషయాన్నే హైలైట్ చేశారు. కానీ ఎన్నికల ఫలితాల్లో మాత్రం సింపతీ పనిచేయలేదని స్పష్టంగా అర్థమవుతోంది. కేంద్రంలో మోదీ మార్క్‌, వివాదరహిత వ్యక్తిత్వం, అవినీతి ఆరోపణలు లేని వ్యక్తిగా మోదీ నిలిచారు. దిల్లీ ప్రజలు మోదీ ప్రత్యేకతను గుర్తించినట్లున్నారు. కేజ్రీవాల్ మద్యం కుంభకోణంలో అవినీతికి పాల్పడకపోతే జైలు నుంచి విడుదలయ్యేవారు కదా అంటూ చర్చించుకున్నారు. సామాజిక కార్యకర్త అన్నా హజారే సైతం కేజ్రీవాల్‌పై విమర్శలు గుప్పించారు. ‘నేను చెబుతూనే ఉన్నా..అవినీతికి పాల్పడొద్దని. అయినా వినలేదు’ అని ఆయన అన్నారు. ఈ పరిణామాలన్నిటీనీ గ్రహించిన ప్రజలు మరోసారి బీజేపీకి మొగ్గుచూపారు. మొత్తానికి మొత్తం ఎన్డీయే కూటమికి అప్పగించాలని సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img