– ఢిల్లీలో ల్యాండ్ అయిన లుఫ్తాన్సా విమానం
ఇదే నిజం, నేషనల్ బ్యూరో: స్విట్జర్లాండ్ నుంచి బ్యాంకాక్ బయలుదేరిన లుఫ్తాన్సా విమానాన్ని బుధవారం ఉదయం దారిమళ్లించారు. దాంతో అది ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యింది. ఇద్దరు ప్రయాణికుల అభ్యంతరకర ప్రవర్తనే ఈ పరిస్థితికి దారితీసిందని సమాచారం. మీడియా కథనాల ప్రకారం.. ‘భార్యభర్తల మధ్య గొడవ కారణంగా విమానాన్ని దారి మళ్లించారు. అయితే వారి గొడవకు కారణం మాత్రం తెలియరాలేదు’ అని విమానాశ్రయ సిబ్బందిని ఉటంకిస్తూ మీడియా కథనాలు వెల్లడించాయి. మొదట తన భర్త(జర్మన్) ప్రవర్తన గురించి భార్య(థాయ్‌లాండ్) పైలట్‌కు ఫిర్యాదు చేసింది. భర్త తనను బెదిరిస్తున్నాడని, సిబ్బంది జోక్యం చేసుకోవాలని కోరింది. ఈ గొడవ గురించి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు వెల్లడించిన పైలట్లు.. ఢిల్లీలో ల్యాండింగ్‌కు అనుమతి కోరారు. ల్యాండింగ్ అనంతరం వారిని విమానం నుంచి దింపేశారు. టెర్మినల్ ఏరియా వద్ద వారితో అధికారులు మాట్లాడారని తెలుస్తోంది. ఆ తర్వాత కొద్దిసేపటికే విమానం టేకాఫ్ అయింది. ఇదిలా ఉంటే.. మొదట ఆ విమానం పాకిస్థాన్‌లో దిగాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రయత్నం అమలుకాలేదు. ఇటీవల కాలంలో విమానంలోని సిబ్బంది, తోటి ప్రయాణికులతో కొందరు అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం ఈజిప్టు నుంచి ఢిల్లీ బయల్దేరిన విమానంలోని సీట్లను ఒక ప్రయాణికుడు ధ్వంసం చేశాడు. అంతేగాకుండా తోటి ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించాడు. విమానం దిల్లీలో దిగిన తర్వాత అతడిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.