– రాష్ట్రవ్యాప్తంగా మరో మూడు రోజులు వర్షాలు
– బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతోనే
– వెల్లడించిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో : రానున్న మూడు రోజుల్లో తెలంగాణలో వర్షాలు కురస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని, ఒకటి రెండు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశమున్నట్లు పేర్కొంది. హైదరాబాద్‌లో కూడా వచ్చే 3 రోజుల్లో వర్షాలు పడతాయని తెలిపింది. ఈ నెల 26 వరకు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, ఉదయం పొగమంచు కమ్మేస్తుందని చెప్పింది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా సగటున 0.3 మిల్లీమీటర్ల వర్షపాతం, అత్యధికంగా నల్గొండ జిల్లా దామరచర్లలో 27.5 మి.మీ. వర్షపాతం నమోదు కాగా మెదక్‌లో 17 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 17.5 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. గాలులు తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తెలంగాణ వైపు వీస్తున్నట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది. హైదరాబాద్‌లో కూడా గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు వర్షం పడింది. నగరంలోని పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, అమీర్‌పేట్, లక్డీకాపూల్, కోఠి, అబిడ్స్, రామంతాపూర్, తార్నాక, సికింద్రాబాద్, ఖైరతాబాద్, ఎర్రగడ్డ, మోహిదీపట్నం, కూకట్ పల్లి, పటాన్‌చెరుతోపాటు తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. వర్షపు నీటితో అక్కడక్కడ రోడ్లు జలమయమమై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.