– ఒక్క పరీక్షను కూడా సరిగా నిర్వహించలేదు
– నిరుద్యోగుల గురించి రాష్ట్ర సర్కారుకు పట్టింపు లేదా?
– రౌండ్ టేబుల్ సమావేశంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
ఇదే నిజం, హైదరాబాద్: టీఎస్పీఎస్సీని దళారులతో నింపేశారని.. రాజకీయ పునారావాస కేంద్రంగా మార్చేశారని బీఆర్ఎస్ సర్కారుపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన హైదరాబాద్ లో జరిగిన నిరుద్యోగుల రౌండ్ టేబుల్ సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరై మాట్లాడారు. ‘నిరుద్యోగుల గురించి సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ఒక్కసారైనా మాట్లాడారా అని కాంగ్రెస్ట్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం కోదండరాం అధ్యక్షతన జరిగిన సమావేశంలో రేవంత్ పాల్గొని మాట్లాడారు.
టీఎస్పీఎస్సీ గురించి మాట్లాడితే కేటీఆర్ నాపై పరువునష్టం దావా వేశాడు. వంద కోట్లు ఇచ్చి ఎంత తిట్టినా నీకు ఓకేనా అని కేటీఆర్‌ను అడుగుతున్నా. టీఎస్సీఎస్సీలో ఏం జరిగినా కేసీఆర్ స్పందించరా? కమీషన్లు తీసుకోవడంపైనే ప్రగతిభవన్‌లో చర్చిస్తారా? రాజకీయ ఖాళీలను ఆగమేఘాల మీద భర్తీ చేస్తున్న కేసీఆర్ సర్కారు నిరుద్యోగ ఖాళీలను ఎందుకు భర్తీ చేయట్లేదు? పదో తరగతి పరీక్షలు నిర్వహించలేరు. ఎంసెట్ పరీక్షా పత్రాలు అమ్ముకునేవారు.. సింగరేణి ఉద్యోగాలను అమ్ముకునే వారు.. చివరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను కూడా కలుషితం చేశారు. దళారులుగా వ్యవహరించిన వారిని, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన వారిని తీసుకొచ్చి టీఎస్పీఎస్సీలో నియమించారు. ఉన్నత విద్యావంతులు ఉండాల్సిన బోర్డులో గుమస్తాలుగా కూడా పనికిరాని వారిని కూర్చోబెట్టారు.’అంటూ రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే క్యాలెండర్ ప్రకారం జాబ్‌ల భర్తీ ఉంటుందని ఆయన చెప్పారు.