– హైదరాబాద్ అగ్ని ప్రమాదాలకు నిలయంగా మారింది
– పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం
– నాంపల్లి ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి
ఇదే నిజం, హైదరాబాద్: నాంపల్లి బజార్ ఘాట్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్ అగ్ని ప్రమాదాలకు నిలయంగా మారిపోయిందన్నారు. వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమైందన్నారు. అపార్ట్మెంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 9 మంది మృతి చెందడం అత్యంత బాధాకరమైన విషయమన్నారు. అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో కారు రిపేర్ల గ్యారేజ్ ఉండటం ఏంటని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెసిడెన్షియల్ ఏరియాలో కెమికల్ డ్రమ్ములు ఎలా నిల్వ చేశారని ప్రశ్నించారు. ఈ విషయంలో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మృతులకు ప్రగాఢ సంతాపం, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని రేవంత్ కోరారు.