నటుడు సిద్ధార్థ్.. తన ప్రియురాలు, నటి అదితిరావు హైదరీని వివాహం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. వనపర్తి జిల్లాలోని శ్రీ రంగాపూర్ రంగనాథ స్వామి దేవాలయంలో బుధవారం ఉదయం వీరి పెళ్లి జరిగినట్లు సమాచారం. ఇరు కుటుంబాల పెద్దలు, అతి తక్కువ మంది బంధువులు మాత్రమే ఈ వేడుకల్లో పాల్గొన్నారని.. సినీ ప్రముఖుల కోసం త్వరలోనే విందు ఏర్పాటుచేయనున్నారని తెలుస్తోంది. అయితే, ఆయా కథనాలపై ఇరు వర్గాల నుంచి ఎలాంటి అఫిషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. అజయ్ భూపతి తెరకెక్కించిన ‘మహా సముద్రం’కోసం సిద్ధార్థ్, అదితి తొలిసారి కలిసి వర్క్ చేశారు. ఆ సినిమా షూట్‌లోనే వీరి మధ్య స్నేహం కుదిరింది. ‘మహాసముద్రం’తర్వాత కలిసి ఫంక్షన్లు, పార్టీలకు హాజరయ్యారు. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం సాగింది. ఆయా కథనాల్లో ఎలాంటి నిజం లేదని.. తాము కేవలం స్నేహితులం మాత్రమేనని పలు సందర్భాల్లో ఈ జంట క్లారిటీ ఇచ్చింది. తాజాగా పెళ్లిపై వార్తలు రావడంతో సిద్ధార్థ్ అభిమానులు కంగ్రాట్స్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు. వనపర్తి సంస్థానాధీశుల వారసుల్లో అదితిరావు ఒకరు. అందుకే ఆమె ఆ సంస్థానానికి చెందిన దేవాలయంలో వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. సిద్ధార్థ్‌కు ఇది రెండో వివాహం. గతంలో మేఘన అనే మహిళతో పెళ్లి జరిగింది. 2007లో వీరిద్దరూ విడిపోయారు. ఆదితికి కూడా ఇది రెండో వివాహమే. గతంలో సత్యదీప్ మిశ్రాతో వివాహం కాగా.. 2012లో విడాకులు తీసుకున్నారు.