T20 World Cup: టీ20 ప్రపంచకప్-2024 మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీని USA-వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇరవై దేశాలు పోటీ పడుతున్నాయి. టైటిల్ గెలవడమే లక్ష్యంగా యూఎస్ఏలో అడుగుపెట్టిన భారత్.. టోర్నీలో హాట్ ఫేవరెట్ ఉంది. గత వన్డే ప్రపంచకప్‌లో తృటిలో చేయి చేజార్చుకున్న రోహిత్ సేన.. ఈసారి షార్ట్‌కప్‌ను కైవసం చేసుకునేందుకు తీవ్రంగా సిద్ధమవుతోంది. కానీ మన జట్టుకు మనోళ్లే ప్రత్యర్థులుగా బరిలోకి దిగడం గమనార్హం. భారత సంతతికి చెందిన 15 మంది ఆటగాళ్లు వివిధ జట్ల లో టీ20 ప్రపంచకప్‌లో ఆడనున్నారు. దీంతో ఈ ప్రపంచకప్‌లో ఏదో ఒక దశలో టీమిండియాతో ప్రత్యర్థిగా వాళ్లు తలపడనున్నారు. యూఎస్‌ఏ ప్రకటించిన జట్టులో ఏకంగా ఆరుగురు మనోళ్లే ఉన్నారు. అమెరికా జట్టులో కెప్టెన్ మోనాంక్ పటేల్, హర్మీత్ సింగ్, మిలింద్ కుమార్, నిసార్గ్ పటేల్, నితీశ్ కుమార్, సౌరభ్ నేత్రవల్కర్ ఉన్నారు. అలాగే కెనడా జట్టులో భారత సంతతికి చెందిన నలుగురు ఆటగాళ్లు ఉన్నారు. కెనడా తరపున రవీందర్‌పాల్ సింగ్, నిఖిల్ దత్తా, వర్గత్ సింగ్, శ్రేయాస్ ఆడుతున్నారు. న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్ర, దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ కేశవ్ మహరాజ్ కూడా భారత సంతతికి చెందినవారే. అలాగే ఉగాండా ఆల్‌రౌండర్ అల్ఫేష్ రంజానీ ముంబైలో జన్మించాడు.