సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘వన్ నేనొక్కడినే’సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన కృతి సనన్.. ఆ తర్వాత బాలీవుడ్‌కు దూసుకెళ్లి క్రేజీ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా.. అందులో 70 శాతంపైగా హిట్లు ఆమె ఖాతాలో ఉన్నాయి. ‘మీమీ’సినిమాలో నటనకుగానూ ఆమె జాతీయ అవార్డును సైతం సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో ట్రేడింగ్‌ను ఆమె సపోర్ట్ చేస్తోందంటూ ఇటీవల కొన్ని వార్తలు వైరలైన సంగతి తెలిసిందే. వీటిపై ఆమె స్పందించింది. తాను అలా మాట్లాడలేదని స్పష్టం చేసింది. ఓ బాలీవుడ్ టాక్‌షోలో ఆమె ట్రేడింగ్ మీడియాను ప్రోత్సహించారని ఇటీవల పలు కథనాలు వచ్చాయి. తాజాగా దీనిపై కృతి ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టింది. ‘కొన్ని వార్తాపత్రికలు నేను మాట్లాడని వాటిని ప్రచారం చేశాయి. ఆ కథనాలు పూర్తిగా అవాస్తవం. ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లతో నాకు అనుబంధం ఉన్నట్లు రాశారు. నేను ఈ అంశంపై ఎప్పుడూ మాట్లాడలేదు. ఇలాంటి తప్పుడు కథనాలు, నివేదికలపై నేను చట్టపరమైన చర్యలు తీసుకున్నాను. లీగల్ నోటీసులు జారీ చేశాను. ఇలాంటి తప్పుడు రిపోర్టుల పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ రాసుకొచ్చారు. ఇక సినిమాల విషయానికొస్తే.. కృతి ఇటీవల ‘గణపథ్: ఎ హీరో ఈజ్ బోర్న్’తో ప్రేక్షకులను పలకరించింది. టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన ఆ సినిమాలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం కృతి బాలీవుడ్‌లో మూడు సినిమాల్లో నటిస్తోంది. అలాగే ‘దో పత్తి’ అనే చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తోంది.