– సముచిత స్థానం కల్పిస్తాం..
– పొన్నాల లక్ష్మయ్యతో మంత్రి కేటీఆర్
– సీఎం కేసీఆర్ సూచన మేరకు బీఆర్ఎస్లోకి ఆహ్వానం
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో : మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యతో మంత్రి కేటీఆర్ భేటి అయ్యారు. శనివారం ఎమ్మెల్యే దానం నాగేందర్, దాసోజు శ్రవణ్‌తో కలిసి కేటీఆర్ హైదరాబాద్‌లోని పొన్నాల నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీలోకి రావాలని లక్ష్మయ్యను ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సూచన మేరకు పొన్నాల లక్ష్మయ్యను బీఆర్ఎస్ పార్టీలో చేరాలని కోరామని, ఆయన ఆదివారం సీఎం కేసీఆర్‌తో భేటి అవుతారన్నారు. జనగామలో జరిగే బహిరంగ సభలో బీఆర్ఎస్లో చేరాలని కోరగా అందుకు సుముఖత చూపారన్నారు.
సీఎం కేసీఆర్‌తో మాట్లాడిన తర్వాత పొన్నాల నిర్ణయం ప్రకటిస్తానని పేర్కొరన్నారు. పొన్నాల లక్ష్మయ్యకు పార్టీలో సముచిత గౌరవం, ప్రాధాన్యం ఇస్తామని, పొన్నాల 1960లోనే అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేసి, నాసా లాంటి అంతర్జాతీయ సంస్థల్లో ఇంజినీర్‌గా పనిచేశారన్నారు. అలాంటి సీనియర్ నాయకుడిపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దిగజారి మాట్లాడటం సరికాదన్నారు. ‘చచ్చే ముందు పార్టీ మారడం అనడమేంది. ఎవరు ఎప్పుడు చనిపోతారో ఎవరికి తెలుసు. ఇది మంచి పద్దతి కాదు.
రేవంత్ రెడ్డి నువ్వు ఎన్ని పార్టీలు మారలేదు. మొదట బీజేపీ ఆ తర్వాత ఆర్‌ఎస్‌ఎస్, టీఆర్‌ఎస్, ఆ తర్వాత టీడీపీ, ఇప్పుడు కాంగ్రెస్, రేపు.. ఏ పార్టీలోకి వెళ్తారో ఎవరికీ తెలీదని, అలాంటి వ్యక్తి కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే చూసే వాళ్లు నవ్వుకుంటున్నారు. కనకపు సింహాసనంపై ఓటుకు నోటు కేసు దొంగను కూర్చోబెట్టారు. కాంగ్రెస్ పార్టీ.. సీనియర్ నేతలకు కనీసం అపాయింట్మెంట్, గౌరవం కూడా ఇవ్వడంలేదు’ అని మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు.