Home Blog Page 1220

#Mobile #Stolen #Police : ఫోన్‌ పోయిందా.. స్టేష‌న్‌కు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాల్సిన ప‌ని లేదు.. ఇలా చేయండి..

0

మీ ఫోన్‌ పోయిందా? లేదా దొంగతనం చేశారా? వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి.

ఆ ఫోన్‌ను రికవరీ చేసి ఇస్తామని హైదరాబాద్‌ పోలీసులు ప్రజలకు భరోసా ఇస్తున్నారు.

ఐఎంఈఐ నంబర్‌, ఫోన్‌ నంబర్‌ వివరాలతో సంప్రదిస్తే ఫోన్‌ వెతికి ఇస్తామని చెప్తున్నారు.

పోగొట్టుకొన్న 66 మంది సెల్‌ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. ఐఎంఈఐ నంబర్‌తో ఫోన్‌ ట్రాక్‌ చేసి యజమానులకు అందించారు.

పోగొట్టుకొన్న చోరీకి గురైన ఫోన్ల ఆచూకీ కనుగొనేందుకు నగర పోలీస్‌స్టేషన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు.

హాక్‌-ఐ యాప్‌, మీసేవలోనూ లాస్ట్‌ ఫోన్‌ ఆప్షన్‌ ఎంచుకొని వివరాలు ఇచ్చి ఫిర్యాదు చేయొచ్చని ఆయన సూచించారు.

మీ సెల్‌ ఫోన్‌ పోయిందా.. ఇలా చేయండి:

  • ఆండ్రాయిడ్‌ యూజర్లు అయితే గూగుల్‌కు వెళ్లి ఫైండ్‌ మై ఫోన్‌ అని టైప్‌ చేయాలి. మీ ఫోన్‌లో లాగిన్‌ అయిన జీమెయిల్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఎంటర్‌చేస్తే మీ ఫోన్‌ లొకేషన్‌ను చూపిస్తుంది.
  • అందులో ఉన్న ఆప్షన్స్‌ను అనుసరిస్తే ఫోన్‌ దొరుకుతుంది.
  • ఫోన్‌ను సైలెంట్‌లో పెట్టినా ఐదు నిమిషాల పాటు ఫోన్‌ రింగ్‌ అయ్యే అవకాశం కూడా ఉంటుంది.
  • మీ ఫోన్‌ ఇతరుల చేతులకు వెళ్లిందనే అనుమానం ఉంటే ఎరేజ్‌ ఆప్షన్‌ను క్లిక్‌ చేస్తే ఫోన్‌లోని కంటెంట్‌ అంతా తొలగించుకోవచ్చు. స్క్రీన్‌ లాక్‌ కూడా వేసుకోవచ్చు.
  • ఐఫోన్‌ ఉన్న వారు గూగుల్‌ బ్రౌజర్‌లోకి వెళ్లి ఫైండ్‌ మై ఫోన్‌ అని సెర్చ్‌ చేస్తే వారికి ఐక్లౌడ్‌ వస్తుంది. అందులో యాపిల్‌ ఐడీ, పాస్‌వర్డ్‌, ఇతర వివరాలు నమోదు చేస్తే ఫోన్‌ లొకేషన్‌ కనిపిస్తుంది.

#Thunder #Rain : పిడుగులు ఎందుకు పడతాయి.. వాటి నుంచి మ‌న‌ల్ని మ‌నం ఎలా ర‌క్షించుకోవాలి..

0

ఏటా పిడుగు పాటు కార‌ణంగా దేశంలో వంద‌ల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మూగ జీవాలు చ‌నిపోతున్నాయి.

అయితే, పిడుగులు ఎప్పుడు, ఎక్క‌డ ప‌డ‌తాయో ముందే అంచ‌నా వేయ‌డంతో పాటు, పిడుగుల బారిన ప‌డ‌కుండా ఉండేందుకు ప్ర‌జ‌లు కొన్ని జాగ్ర‌త్త‌లు పాటిస్తే ప్రాణ‌, ఆస్తి న‌ష్టాన్ని చాలా వ‌ర‌కు త‌గ్గించొచ్చని నిపుణులు చెబుతున్నారు.

అలాగే, పిడుగు అంటే ఏమిటి? అవి ఎలా పుడ‌తాయి? వ‌ంటి విష‌యాలు తెలుసుకోవ‌డం కూడా ముఖ్యం.

పిడుగులు ఎలా పుడతాయి?

ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పుడు నీరు ఆవిరిగా మారి ఆకాశంలో దాదాపు 25,000 అడుగుల ఎత్తు వరకు మేఘాలు ఏర్పడతాయి.

అయితే, పై నుంచి సూర్యరశ్మి అధికంగా తాకడం వల్ల తక్కువ బరువున్న ధనావేశిత(+) మేఘాలు పైకి వెళ్తాయి.

అధిక బరువుండే రుణావేశిత (ఎలక్ట్రాన్లు అధికంగా ఉన్న) మేఘాలు కిందికి వస్తాయి. అంటే, ఎప్పుడూ మనకు కనిపించే దట్టమైన మబ్బుల్లో ఎలక్ట్రాన్లు ఎక్కువగా ఉంటాయన్నమాట.

సైన్స్ ప్రకారం, రుణావేశిత మేఘాలలోని ఎలక్ట్రాన్లు సమీపంలోని ధనావేశిత మేఘాలవైపు ఆకర్షితమవుతుంటాయి.

అయితే, ధనావేశిత మేఘాలు చాలా ఎత్తుకు వెళ్లిపోయినప్పుడు దగ్గరలో మరే వస్తువు ఉన్నా అటువైపు ఎలక్ట్రాన్లు ప్రయాణిస్తాయి.

ఆ క్రమంలోనే మేఘాల నుంచి ఎలక్ట్రాన్లు ఒక్కసారిగా విడుదలై విద్యుత్‌ క్షేత్రంగా మారి భూమి మీదకు దూసుకొస్తాయి. దాన్నే ‘పిడుగు పడటం’ అంటారని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ విభాగంలో పనిచేస్తున్న నిపుణులు హరి కిరణ్ వివరించారు.

మేఘాల నుంచి ఎలక్ట్రాన్లు విడుదలయ్యే సమయంలోనే ఉరుములు, మెరుపులు పుడతాయని ఆయన తెలిపారు.

భూమి మీదే ఎక్కువ

అలా మేఘాల నుంచి పడే ‘పిడుగు’లో దాదాపు 30 కోట్ల వోల్టుల విద్యుత్ ఉంటుంది, అది మనిషిని అక్కడిక్కడే కాల్చి బూడిద చేయగలదు.

ప్రధానంగా ఎండా కాలంలో సముద్ర తీర ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి. దాంతో ఆ ప్రాంతాల్లో పిడుగులు ఎక్కువగా పడే అవకాశం ఉంటుందని నాసా పరిశోధనలో తేలింది.

అందులోనూ సముద్రంలో కంటే భూమిపైనే పిడుగులు ఎక్కువగా పడే అవకాశాలు ఉంటాయి.

పిడుగుపాటును ముందస్తుగా గుర్తించి ప్రజలను అప్రమత్తం చేసే పరిజ్ఞానాన్ని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ వినియోగిస్తోంది.

అందుకోసం అమెరికాకు చెందిన ఎర్త్‌నెట్ వర్క్‌తో పాటు, ఇస్రో సహకారం తీసుకుంటోంది. ఎర్త్ నెట్‌వర్క్ ద్వారా రాష్ట్రంలో సెన్సర్ల ఏర్పాటు చేశారు.

ఎక్కడ ఏ సమయంలో పిడుగులు పడే అవకాశముందో ఈ సెన్సర్ల ద్వారా అధికారులు ఓ అంచనాకు వస్తారు. దాంతో మండలాల వారీగా ప్రజల ఫోన్లకు ఎస్సెమ్మెస్‌లు పంపి అప్రమత్తం చేస్తున్నారు.

దీని ద్వారా 30 నుంచి 40 నిమిషాల ముందే పిడుగు పడబోయే ప్రాంతాన్ని గుర్తించొచ్చని హరి కిరణ్ బీబీసీకి చెప్పారు.

పిడుగుల నుంచి తప్పించుకోవడం ఎలా?

ఉరుములు మెరుపులు వస్తున్నప్పుడు ఇంట్లో ఉంటే బయటకు రాకపోవడమే మంచిదే. కారులో ఉంటే అందులోనే ఉండటం ఉత్తమం.

పొలాల్లో పనిచేసే రైతులు ఇళ్లకు లేదా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలి.

భూమి పొడిగా ఉన్న చోటుకి వెళ్లాలి.

చెట్ల కిందకు, టవర్ల కిందకు వెళ్లకూడదు.

సెల్‌ఫోన్‌, ఎఫ్‌ఎం రేడియో వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను వినియోగించకూడదు.

ఒకవేళ తలదాచుకునేందుకు ఆశ్రయం లేనప్పుడు తమను తాము రక్షించుకునేందుకు ప్రయత్నించాలి. మోకాళ్లపై చేతులు, తల పెట్టి దగ్గరగా ముడుచుకుని కూర్చోవాలి. దాంతో ఆ పిడుగు పడినప్పుడు వెలువడే విద్యుత్ ప్రభావం మన మీద తక్కువగా పడే అవకాశం ఉంటుంది.

భూమి మీద అరికాళ్లు పూర్తిగా పెట్టకుండా వేళ్ల మీద కూర్చోవాలి.

ఒకవేళ నీటిలో ఉన్నట్టయితే సాధ్యమైనంత త్వరగా బయటకు వెళ్లాలి.

ఇళ్లలో టీవీలు, రిఫ్రిజిరేటర్లను ఆపేయాలి. లేదంటే పిడుగు పడినప్పుడు విద్యుత్ తీగల ద్వారా హై వోల్టేజీ ప్రవహించడంతో అవి కాలిపోయే ప్రమాదం ఉంటుంది.

ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ స్తంభాలకు దూరంగా ఉండాలి.

ఉరుములతో కూడిన వర్షం వచ్చే అవకాశం ఉందని తెలిస్తే బయటకు వెళ్లకుండా పనులను వాయిదా వేసుకోవాలి.

ఉరుములు మెరుపులు వస్తున్నప్పుడు స్నానం చేయడం, పాత్రలు కడగటం ఆపేస్తే మంచిది. ఎందుకంటే లోహపు పాత్రలు, పైపుల ద్వారా ఒక్కసారిగా పెద్దమొత్తంలో విద్యుత్ ప్రవహించే అవకాశం ఉంటుంది.

పిడుగు బారిన పడినప్పుడు శరీరంపై రెండు చోట్ల గాయాలవుతాయి. ప్రధానంగా విద్యుత్ ప్రవహించిన చోట, మళ్లీ బయటకు వెళ్లిన చోట(ఎక్కువగా అరికాళ్లపై) గాయాలు అవుతాయి.

బాధితులను ముట్టుకుంటే షాక్ తగులుతుందని కొందరు చెబుతుంటారు. కానీ అందులో నిజం లేదు.

బాధితులకు వెంటనే ప్రథమ చికిత్స అందించాలి.

#Sirisha #VirginGalactic : సరికొత్త చరిత్రకు సిద్ధమవుతున్న తెలుగమ్మాయి

0

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన బండ్ల శిరీష సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు.

రాకేశ్ శర్మ, కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ తర్వాత రోదసీలోకి వెళ్తున్న నాలుగో భారత వ్యోమగామిగా చరిత్ర సృష్టించబోతున్నారు.

ప్రముఖ అంతరిక్ష సంస్థ వర్జిన్ గెలాక్టిక్‌కు చెందిన మానవ సహిత వ్యోమనౌక వీఎస్ఎస్ యూనిటీ-22 ద్వారా నేడే రోదసీలోకి వెళ్లనున్నారు.

ఈ వ్యోమనౌకలో వర్జిన్ గెలాక్టిక్ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్‌తో పాటు మరో ఐదుగురు వెళ్తుండగా అందులో 34 ఏళ్ల శిరీష కూడా ఉన్నారు.

ఈ సందర్భంగా వ్యోమనౌకలో మానవ తీరుతెన్నులకు సంబంధించి ఫ్లోరిడా యూనివర్సిటీ రూపొందించిన ప్రయోగాన్ని శిరీష నిర్వహిస్తారు.

శిరీష ప్రస్తుతం వర్జిన్ గెలాక్టిక్‌లో ప్రభుత్వ వ్యవహారాలు, పరిశోధన కార్యకలాపాల విభాగానికి ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు.

న్యూ మెక్సికోలో వర్జిన్ గెలాక్టిక్ నిర్మించిన ‘స్పేస్‌పోర్టు అమెరికా’ నుంచి నేడు మొదలయ్యే అంతరిక్ష యాత్ర 90 నిమిషాలపాటు కొనసాగుతుంది.

భూమి నుంచి 90 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్న వ్యోమనౌక భూమికి, రోదసీకి సరిహద్దుగా భావించే కర్మాన్ రేఖను దాటి వెళ్తుంది.

ఇక్కడికి చేరిన వారిని వ్యోమగాములుగానే పరిగణిస్తారు. వ్యోమనౌక అక్కిడికి చేరాక అందులోని వారందరూ కొద్దిసేపు భార రహిత స్థితిని అనుభవిస్తారు.

అనంతరం వ్యోమనౌక తిరిగి భూవాతావరణంలోకి ప్రవేశిస్తుంది.

#YSR : ఇదీ వైఎస్సార్ అంటే…

0

యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి (జూలై 8, 1949 – సెప్టెంబర్ 2, 2009) ఆంధ్ర ప్రదేశ్ 16వ ముఖ్యమంత్రి, కాంగ్రేసు పార్టీ నాయకుడు.

1978లో తొలిసారిగా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంనుంచి శాసనసభలో అడుగుపెట్టిన రాజశేఖరరెడ్డి మొత్తం 6 సార్లు పులివెందుల నుంచి ఎన్నికకాగా, 4 సార్లు కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటులో అడుగుపెట్టాడు.

ఆయన పోటీచేసిన ప్రతి ఎన్నికలలోనూ విజయం సాధించారు . జనతాపార్టీ ప్రభంజనాన్ని తట్టుకొని విజయం సాధించిన తొలి ఎన్నికల (1978) వెంటనే మంత్రిపదవి పొందాడు. ఆ తరువాత వెనువెంటనే ముగ్గురు ముఖ్యమంత్రులు మారిననూ ఆ మూడు మంత్రిమండళ్లలో స్థానం సంపాదించాడు. ఆ తరువాత చాలా కాలం పాటు ఎటువంటి ప్రభుత్వ పదవీ దక్కలేదు. 1989-94 మధ్య ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నించినా అవకాశం రాలేదు.

1999లో మళ్ళీ శాసనసభకు ఎన్నికై ప్రతిపక్షనేతగా ఉంటూ తదుపరి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు వ్యూహం రచించాడు. 2003లో మండువేసవిలో 1460 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర మరియు ఉచిత విద్యుత్ ప్రచారం అతని విజయానికి బాటలు పరచింది. 2004 ఎన్నికలలో పులివెందుల నియోజకవర్గం నుంచి 40వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించడమే కాకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు పొందడంతో ముఖ్యమంత్రి పీఠం వై.ఎస్.రాజశేఖరరెడ్డికే దక్కింది.

ఆయన సెప్టెంబర్ 2, 2009న చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి హాజరవడానికి వెళ్తూ నల్లమల అడవులలో హెలికాప్టర్ ప్రమాదానికి గురై దుర్మరణం పాలయ్యాడు. వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అవినీతిపై ఆయన మంత్రివర్గ సభ్యులే కాకుండా కేంద్రమంత్రులు, ప్రస్తుత మంత్రులు, ప్రధాన ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మైసూరారెడ్డి లెక్కలువేయగా అప్పటి మంత్రి పి.శంకర్రావు వ్యాఖ్యలను కోర్టు సుమోటాగా స్వీకరించి విచారణ చేపట్టింది. వైఎస్సార్ కాలంలో అవినీతి జరిగిందని సీబీఐ ప్రాథమిక విచారణలో వెల్లడించింది. “క్విడ్ ప్రో కో ” రూపంలో జగన్ కు చెందిన కంపెనీలలో పెట్టుబడులు వచ్చినట్లు సీబీఐ చార్జిషీటులో పేర్కొంది.

బాల్యం

వై.యస్.రాజశేఖర్ రెడ్డి 1949 జూలై 8 న వైఎస్ఆర్ జిల్లా, జమ్మలమడుగులోని సి.ఎస్.ఐ. కాంప్‌బెల్ మిషన్ ఆసుపత్రిలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు జయమ్మ, రాజారెడ్డి. ఆయన తండ్రి బళ్ళారిలో కాంట్రాక్టరుగా పనిచేస్తుండటం వల్ల ఆయన పాఠశాల చదువంతా బళ్ళారిలోని సెయింట్ జాన్స్ పాఠశాలలో సాగింది. ఆ తర్వాత విజయవాడ లయోలా కళాశాలలో చేరాడు.

1972లో గుల్బర్గా విశ్వవిద్యాలయం నుంచి వైద్యవిద్యలో పట్టా పుచ్చుకున్నాడు. గుల్బర్గాలోని మహాదేవప్ప రాంపూరే వైద్య కళాశాలలో వైద్యవృత్తిని అభ్యసిస్తుండగానే కళాశాల విద్యార్థిసంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరించాడు. శ్రీ వెంకటేశ్వర వైద్యకళాశాల (యెస్.వి.ఆర్.ఆర్), తిరుపతి నుంచి హౌస్‌సర్జన్ పట్టా పొందాడు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల వైపు ఆకర్షితుడైన రాజశేఖరరెడ్డి యెస్.వి.ఆర్.ఆర్ కళాశాలలో పనిచేస్తుండగానే అక్కడ హౌస్‌సర్జన్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.

తరువాత కొద్దిరోజులపాటు జమ్మలమడుగులోని సి.ఎస్.ఐ. కాంప్‌బెల్ ఆసుపత్రిలో వైద్య అధికారిగా పనిచేశాడు. ఆ తరువాత 1973లో పులివెందులలో తండ్రి వై.ఎస్.రాజారెడ్డి పేరుతో కట్టించిన 70 పడకల ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేశాడు.

ఆ ఆసుపత్రి ఇప్పటికీ పనిచేస్తూనే ఉంది. వాళ్ళ కుటుంబం పులివెందులలో ఒక పాలిటెక్నిక్ కళాశాల మరియు డిగ్రీ కళాశాలను కూడా నెలకొల్పారు. తరువాత వాటిని లయోలా సంస్థలకు అప్పగించారు. పులివెందుల దగ్గరిలో ఉన్న సింహాద్రిపురంలో ఉన్న కళాశాలను మాత్రం ఇప్పటికీ వీరి కుటుంబమే నిర్వహిస్తోంది.

రాజకీయ జీవితం

కళాశాల దశ నుంచే రాజకీయాలపై ఆసక్తి చూపిన రాజశేఖరరెడ్డి 1980-83 కాలంలో రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిపదవిని నిర్వహించాడు. కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎన్నికయ్యాడు. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 6 సార్లు విజయం సాధించాడు. రాష్ట్ర శాసనసభ ప్రతిపక్షనేతగానూ, రెండు సార్లు రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రేస్ కమిటీ అధ్యక్షుడిగానూ పనిచేశాడు.

1980 నుంచి 1983 దాకా గ్రామీణాభివృద్ధి, వైద్యశాఖ, విద్యాశాఖ మొదలైన కీలకమైన మంత్రి పదవులను నిర్వహించాడు. తెలుగు దేశం నేత నారా చంద్రబాబు నాయుడు మొదటగా కాంగ్రెస్ లో ఉన్నపుడు ఇరువురూ మంచి మిత్రులు. 1985 నుంచి 1998 వరకు పార్టీలో వై.ఎస్. నిత్య అసమ్మతివాదిగా పేరుపడ్డారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులందరితో ఆయన పోరాటం చేయాల్సి వచ్చింది. 1989-94 మధ్య కాలంలో ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నించినా సాధ్యపడలేదు.

మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి వంటి నేతలతో ఆయన రాజకీయ యుద్ధమే చేశారు. వారికి వ్యతిరేకంగా క్యాంపులు నడిపాడు. మర్రి చెన్నారెడ్డిని, నేదురుమిల్లి జనార్ధన్‌రెడ్డిని పదవినుండి తొలగించడానికి ప్రధాన కారణమైన హైదరాబాదు నగరంలో జరిగిన అల్లర్లలో రాజశేఖర్ రెడ్డి వర్గపు పాత్ర ఉందన్న ఆరోపణలు వచ్చాయి. అదే తాను ముఖ్యమంత్రి అయ్యేనాటికి అలాంటి శిబిరాలు లేని పరిస్థితిని సృష్టించుకోగలిగాడు. రాజకీయాల్లో ముక్కుసూటితనానికి, నిర్మొహమాట ధోరణికి రాజశేఖరరెడ్డి ప్రసిద్ధుడు.

పిసిసి అధ్యక్షుడిగా

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా వై.ఎస్.రాజశేఖరరెడ్డి రెండు సార్లు పనిచేశాడు. తొలిసారి 1983 నుంచి 1985 వరకు మరియు రెండో పర్యాయం 1998 నుంచి 2000 వరకు ఆ పదవిలో ఉన్నాడు. 1999 నుంచి 2004 వరకు 11 వ శాసనసభలో ప్రతిపక్షనేతగానూ వ్యవహరించాడు.

పాదయాత్ర

2003 వేసవికాలంలో ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో పాదయాత్ర చేపట్టి 1,467 కిలోమీటర్లు పర్యటించాడు. పాదయాత్ర వలన వ్యక్తిగతంగా వైఎస్.కు మంచి జనాదరణ లభించడమే కాకుండా ఆ తదుపరి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడింది.

ముఖ్యమంత్రిగా

2004 మేలో జరిగిన 12వ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికస్థానాలు సాధించడంతో అదివరకే పార్టీలో పేరుసంపాదించిన వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాడు. పాదయాత్ర వలన జనాదరణ పొందడమే కాకుండా ఎన్నికల ప్రచారంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, పెండింగులో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తిచేయటం, జలయజ్ఞంలకు ప్రాధాన్యం ఇవ్వడంతో ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన పిదప తొలి సంతకం ఉచిత విద్యుత్తు ఫైలు పైనే చేశాడు.

2009 ఏప్రిల్లో జరిగిన 13వ శాసనసభ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలలో విజయం సాధించడానికి కృషిచేసి వరుసగా రెండో పర్యాయం ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాడు.

2009 ఎన్నికలు

2009 ఏప్రిల్‌లో జరిగిన శాసనసభ మరియు లోక్‌సభ ఎన్నికలలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ముందుండి నడిపించడమే కాకుండా శాసనసభలో 156 స్థానాలతో పూర్తి మెజారిటీని సంపాదించిపెట్టాడు.

అదేసమయంలో లోక్‌సభ ఎన్నికలలో 33 స్థానాలలో విజయం సాధించడానికి కృషిచేసి దేశంలోనే కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్లుఫ్ఫ్ర్ సంపాదించిపెట్టిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను కాంగ్రెస్ అధిష్టానం ముందు సగర్వంగా నిలబెట్టారు.

కుటుంబం
వై.యస్. రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయలక్ష్మి. వారికి ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం కడప లోక్‌సభ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.ఆయన చాలా వ్యాపారాలతో పాటు సాక్షి దినపత్రిక, సాక్షి టీవీ చానల్ కూడా నిర్వహిస్తున్నాడు.

కూతురు షర్మిళ. తండ్రి రాజారెడ్డి ముఠాకక్షల కారణంగా బాంబుదాడిలో మరణించడం జరిగింది. గుల్బార్గాలో వైద్యవిద్య చదువుతున్నప్పటి నుంచీ ఆయనకు అత్యంత ఆప్తమిత్రుడు కె.వి.పి. రామచంద్రరావు. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాక ఆయన్ను సలహాదారుగా నియమించుకున్నాడు.

హెలికాప్టర్ ప్రమాదంలో మృతి

సెప్టెంబర్ 2, 2009 న చిత్తూరు జిల్లా పర్యటనకు బయలుదేరగా ఉదయం గం.9.35 నిమిషాలకు హెలికాప్టరు‌తో సంబంధాలు తెగిపోయాయి. ముఖ్యమంత్రి ఆచూకీ కోసం గాలించగా 25 గంటల తరువాత ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ఆనవాళ్ళు లభించాయి. వై.ఎస్.తో సహా మొత్తం ఐదుగురు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. తమ అభిమాన నాయకుని మరణాన్ని జీర్ణించుకోలేక రాష్ట్ర మంతా దాదాపు 67 మంది మరణించారు. వీరిలో చాలా మంది గుండె ఆగి మరణించగా కొద్ది మంది ఆత్మహత్య చేసుకున్నారు.

ప్రమాదస్థలమైన రుద్రకొండ కర్నూలు-ప్రకాశం జిల్లా సరిహద్దులో ఆత్మకూరు – వెలుగోడుకు సమీపంలోని నల్లమల అడవుల్లో ఉంది. హెలికాప్టర్‌ కూలిన ప్రాంతం కర్నూలు జిల్లా ఆత్మకూరునుంచి 8 కిలోమీటర్ల దూరంలోని నల్లకాలువ గ్రామం మీదుగా 16 కిలోమీటర్ల దూరంలోని రుద్రకోడూరు గ్రామానికి దట్టమైన అటవీ మార్గంలో ప్రమాద స్థలి మరో 16 కిలోమీటర్లు దూరం ఉంది.

ప్రమాదంపై విచారణ సంఘము
నల్లమల అడవులలో సంభవించిన హెలికాప్టర్ దుర్ఘటనపై కేంద్ర ప్రభుత్వం విచారణ సంఘాన్ని నియమించింది. పవన్‌హన్స్ హెలికాప్టర్ లిమిటెడ్ యజమాని ఆర్.కె.త్యాగి ఈ విచారణ కమిటీకి నేతృత్వం వహించాడు.

కాలరేఖ పదవులు

  • 1975: యవజన కాంగ్రెస్ కార్యదర్శిగా నియామకం.
  • 1980: తొలిసారిగా రాష్ట్ర మంత్రివర్గంలో గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రిగా నియామకం.
  • 1982: రాష్ట్ర మంత్రివర్గంలో ఎక్సైజ్ శాఖా మంత్రి పదవి లభించింది.
  • 1982: రాష్ట్ర మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా నియామకం.
  • 1983: పిసిసి అధ్యక్షుడిగా నియమించబడ్డాడు (1985 వరకు).
  • 1998: రెండోసారి పిసిసి అధ్యక్షుడిగా నియామకం (2000 వరకు).
  • 1999: శాసనసభ ప్రతిపక్షనేతగా ఎన్నికయ్యారు.
  • 2004: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు.
  • 2009: రెండోపర్యాయం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు.

విజయాలు

  • 1978: పులివెందుల నుంచి తొలిసారి శాసనసభ్యుడిగా గెలుపొందినాడు.
  • 1983: పులివెందుల నుంచి రెండోసారి శాసనసభ్యుడిగా విజయం.
  • 1985: పులివెందుల నుంచి వరుసగా మూడవసారి శాసనసభ్యుడిగా హాట్రిక్ విజయం.
  • 1989: కడప నియోజకవర్గం నుంచి తొలిసారి లొకసభ సభ్యుడిగా విజయం.
  • 1991: కడప నియోజకవర్గం నుంచి రెండోసారి గెలుపు.
  • 1996:కడప నుంచి వరుసగా మూడవసారి గెలుపొంది హాట్రిక్ సాధించాడు.
  • 1998: కడప నుంచి వరుసగా నాలుగవసారి ఎన్నికలలో విజయం సాధించాడు.
  • 1999: పులివెందుల నుంచి నాలుగవసారి శాసనసభ్యుడిగా గెలుపు.
  • 2004: పులివెందుల నుంచి ఐదవసారి శాసనసభ్యుడిగా విజయసాధించాడు.
  • 2009: పులివెందుల నుంచి రెండోసారి హాట్రిక్ విజయం, శాసనసభ్యుడిగా గెలుపొందడం ఆరవసారి

#Riemann Hypothesis : లెక్కకు జవాబు చెప్పి రూ.7.3 కోట్లు గెలుచుకున్న హైదరాబాద్ ప్రొఫెసర్ కుమార్ ఈశ్వరన్….

0
  • రీమన్ హైపోథీసిస్ లెక్క తేల్చిండు
  • 161 ఏళ్లుగా ఆన్సర్ లేని ప్రశ్నకు శ్రీనిధి ఇనిస్టిట్యూట్ప్రొఫెసర్ పరిష్కారం
  • రూ.7.3 కోట్లు గెలుచుకున్న కుమార్ ఈశ్వరన్

మ్యాథమేటిక్స్​లో 161 ఏళ్లుగా ‘జవాబు’ లేని సవాల్​ అది. ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రయత్నించినా ఆ థియరీకి పరిష్కారం దొరకలేదు.

కానీ, హైదరాబాద్​కు చెందిన డాక్టర్​ కుమార్​ ఈశ్వరన్​ దానికి పరిష్కారం కనుగొన్నారు.

‘రీమన్​ హైపోథీసిస్​’ వేసిన చిక్కుముడులను శ్రీనిధి ఇన్‌‌స్టిట్యూట్​లో మ్యాథ్స్​ ప్రొఫెసర్​ అయిన ఆయన విప్పేశారు. ఆ సిద్ధాంతాన్ని ‘ప్రూవ్​’ చేసి చూపించారు.

పరిష్కారానికి మిలియన్ డాలర్లు…

లెక్కల్లో పరిష్కారం కాని టాప్​ పది సిద్ధాంతాల్లో రీమన్​ హైపోథీసిస్​ మొదటి స్థానంలో ఉంటుంది.

దీన్ని పరిష్కరిస్తే పది లక్షల డాలర్లు (సుమారు రూ.7.3 కోట్లు) బహుమతి ఇస్తామని కేంబ్రిడ్జిలోని క్లే మ్యాథమేటిక్ ​​సంస్థ ప్రకటించింది.

ప్రముఖ మ్యాథ్స్​ సైంటిస్ట్​​ కార్ల్​​ ఫ్రెడరిక్​ గాస్​ చేసిన లెక్కల నుంచి రీమన్​ హైపోథీసిస్​​ వచ్చింది.

ఆయన సూత్రం ప్రకారం ఏదైనా ఒక సంఖ్య కంటే తక్కువ ప్రధాన సంఖ్యల సంఖ్యను అంచనా వేసేందుకు ఇది ఉపయోగపడుతుంది.

తర్వాతి కాలంలో జార్జ్ ​​ఫ్రెడరిక్​ బెర్నార్డ్ ​​రీమన్​.. ఆ సూత్రాన్ని మెరుగుపరిచారు. సంక్లిష్ట వేరియబుల్​ ఫంక్షన్ల కాలిక్యులస్​తో కొత్త పద్ధతిని ఉపయోగించారు.

ఐదేళ్లుగా రివ్యూలు…

సంక్షిష్ట వేరియబుల్​లో ప్రత్యేకంగా తీసుకున్న ఫంక్షన్​లో విశ్లేషణాత్మక ప్రవర్తనను నిర్ణయిస్తే రీమన్​​హైపోథీసిస్​ను​పరిష్కరించవచ్చని ఈశ్వరన్​​ రుజువు చేశారు.

సంఖ్యల అంకగణిత లక్షణాలను ఉపయోగించడంతో హైపోథీసిస్​​ సక్సెస్​ అయినట్టు తేల్చారు.

ఈశ్వరన్ ​​రుజువు చేసిన హైపోథీసిస్​ను దాదాపు ఐదేళ్ల కిందట 2016లోనే ఇంటర్నెట్​లో పెట్టారు.

దీన్ని పరిశీలించేందుకు శ్రీనిధి విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిపుణుల కమిటీని 2021 ఫిబ్రవరిలో ఏర్పాటు చేశారు.

ఈ కమిటీకి జాతీయ స్థాయి సలహాదారుగా దేశ శాస్ట్ర సాంకేతిక శాఖ మాజీ కార్యదర్శి టి. రామస్వామి ఉన్నారు.

శ్రీనిధి ఇనిస్టిట్యూట్​ ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​ ప్రొఫెసర్​ నర్సింహా రెడ్డి, హైదరాబాద్​ సెంట్రల్​ యూనివర్సిటీ ప్రొఫెసర్​ సీతారామన్​, చెన్నైలోని ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ మ్యాథ్స్​ అండ్​ సైన్స్​ ప్రొఫెసర్​ కె. శ్రీనివాస రావు, సెంటర్​ ఫర్​ పాలసీ స్టడీస్​ ప్రొఫెసర్​ శ్రీనివాస్​, ఐఐటీ హైదరాబాద్​ ప్రొఫెసర్​ వినాయక్​ ఈశ్వరన్​లు సభ్యులుగా ఉన్నారు.

ఈ సిద్ధాంతాన్ని1,200 మందికిపైగా మ్యాథ్స్​ నిపుణులు రివ్యూ చేశారు.

ఇంటర్నేషనల్​ నిపుణులు సమీక్షలు పంపిస్తే ఈశ్వరన్​ సమాధానాలు ఇచ్చారు.

ఈ ఏడాది మే 16న జరిగిన చివరి సమావేశంలో రీమన్​​ హైపోథీసిస్​కు ఈశ్వరన్​ ప్రతిపాదించిన సిద్ధాంతం సరైందని కమిటీ తేల్చింది.

ఈ సిద్ధాంతం గురించి పూర్తి సమాచారాన్ని మొదటగా ఈ–బుక్ ద్వారా ప్రచురించి, తర్వాత పుస్తక రూపంలో తీసుకురావాలని నిర్ణయించారు…

#Rakul : అక్షయ్ కుమార్ జోడీగా ఛాన్స్ కొట్టేసిన రకుల్

0

తెలుగులో చాలా వేగంగా స్టార్ డమ్ ను అందుకున్న కథానాయికల జాబితాలో రకుల్ పేరు ముందు వరుసలో కనిస్తుంది.

చిన్న సినిమాతో తన కెరియర్ ను మొదలుపెట్టిన రకుల్, స్టార్ హీరోల జోడీగా మెరవడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు.

ఒకానొక దశలో ఆమె స్టార్ హీరోల సరసన వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్లింది.

ఆ సమయంలోనే ఆమెకి కోలీవుడ్ నుంచి అవకాశాలు వచ్చాయి. అయితే రకుల్ మాత్రం బాలీవుడ్ సినిమాలపై ఎక్కువగా దృష్టిపెట్టింది.

బాలీవుడ్ చుట్టూ రకుల్ ప్రదక్షిణ చేస్తుంటే, ఇక్కడ ఆమెకి గల ప్లేస్ చేజారిపోయింది.

ఒక్కసారిగా తెలుగులో రకుల్ కి సినిమాలు తగ్గిపోయాయి.

ఇక తమిళంలో ఆమె పెద్దగా దృష్టి పెట్టలేదు గనుక, ఆ విషయాన్ని గురించి మాట్లాడుకోవలసిన అవసరం లేదు.

అయితే బాలీవుడ్ లో నిలదొక్కుకోలేకపోతే రకుల్ పని అయిపోయినట్టేనని అంతా అనుకున్నారు.

కానీ బాగానే బాలీవుడ్ లో ఓ మూడు సినిమాలు చేస్తోంది. అంతేకాదు అక్షయ్ కుమార్ జోడీగా చేసే ఛాన్స్ కొట్టేసింది.

రంజిత్ తివారి ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. శ్రద్ధా కపూర్ .. కియారా   అద్వానీని దాటుకుని ఈ ఛాన్స్ రకుల్ కి రావడం విశేషం.

#Kerala #women #SI : ఒకప్పుడు నిమ్మకాయ సోడా అమ్మిన ఊరికే ఎస్సైగా వచ్చిన యువతి

0

“కృషి ఉంటే మనుషులు రుషులవుతారు” అంటూ ఓ తెలుగు సినీ కవి పేర్కొన్నది అక్షర సత్యం.

అందుకు నిదర్శనంగా కేరళకు చెందిన ఆనీ (31) గురించి చెప్పుకోవచ్చు.

ఒకప్పుడు నిమ్మకాయ సోడాలు అమ్మిన ఆనీ ఇప్పుడు రాష్ట్ర పోలీసు విభాగంలో సబ్ ఇన్ స్పెక్టర్.

అది కూడా వైవాహిక జీవితం విచ్ఛిన్నం కాగా, ఓ శిశువుకు జన్మనిచ్చి సమాజంలో ఎంతో వ్యతిరేకతను ఎదుర్కొంటూనే తాను అనుకున్నది సాధించిన ఆనీ… ఇప్పుడు తనలాంటి మరెందరికో ఆదర్శంగా నిలుస్తోంది.

ఆనీ… చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని, ఆ గృహ హింసను భరించలేక భర్త నుంచి విడిపోయి వచ్చేసింది.

అప్పటికి తన వయసు 19 ఏళ్లు. 9 నెలల పసికందుతో కాపురం వదిలేసుకుని వచ్చి ఈ లోకాన్ని ఎదిరించి నిలిచిన ఆనీ…

పొట్టకూటి కోసం నిమ్మకాయ సోడాలు, ఐస్ క్రీమ్ విక్రయించడమే కాకుండా, బీమా ఏజెంటుగానూ పనిచేసింది.

నెలకు రూ.3,500 సంపాదిస్తే రూ.3 వేలు ఇంటి అద్దెకే పోయేవని, తన బాబు కోసం రూ.400 దాచిపెట్టగా, తన వద్ద రూ.100 మిగిలేవని ఆనీ మీడియాకు తెలిపింది.

ప్రస్తుతం ఆనీ కేరళ రాజధాని తిరువనంతపురంలోని వర్కాల పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా పనిచేస్తోంది.

ఒకప్పుడు ఇదే వర్కాల వీధుల్లో సాధారణ విక్రేతగా ఉన్న తాను పోలీస్ ఇన్ స్పెక్టర్ గా తిరిగిరావడం మాటల్లో వర్ణించలేనని పేర్కొంది.

మొత్తమ్మీద గర్వంగా ఫీలవుతున్నానని వెల్లడించింది.

కాగా, ఆనీ కాపురం వదిలేసుకుని వచ్చేయడాన్ని ఆమె తల్లిదండ్రులు హర్షించలేదు. ఆమె తండ్రి ఇప్పటికీ మాట్లాడడట.

తల్లి మాత్రం కుమార్తె మనసు తెలుసుకుని గత రెండేళ్లుగా ఆనీతోనే ఉంటోంది.

తాను గతంలో చేసుకున్నది పెద్దలు కుదిర్చిన పెళ్లి కాకపోవడంతో, ఆ పెళ్లి విచ్ఛిన్నమైనప్పుడు తల్లిదండ్రులు తన నిర్ణయాన్ని స్వాగతించలేదని ఆనీ తెలిపింది.

చంటిబిడ్డతో కలిసి తన బామ్మ వద్ద ఉంటూ బతుకుతెరువు కోసం అనేక పనులు చేశానని చెప్పింది.

ప్రస్తుతం తాను ధరిస్తున్న పోలీస్ యూనిఫాం విలువ తనకు తెలుసని, ఆ యూనిఫాం తనకే కాకుండా తనలాంటి ఎంతో మంది ఇతర స్త్రీలకు, వృద్ధ మహిళలకు కూడా రక్షణ ఇస్తుందని పేర్కొంది.

#Congress : కేసీఆర్ దళిత ద్రోహి.. పొన్నాల లక్ష్మయ్య

0

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య నిప్పులు చెరిగారు.

కేసీఆర్ దళిత ద్రోహి అని మండిపడ్డారు. దళితులకు సంబంధించి జరిగిన అఖిలపక్ష సమావేశానికి తనకు ఇష్టమైన వాళ్లనే పిలిచారని విమర్శించారు.

దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని చెప్పిన కేసీఆర్ ఇంత వరకు ఏమీ చేయలేదని అన్నారు.

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి దళితుడే అని చెప్పిన కేసీఆర్… తన కేబినెట్ లో దళితులకు కనీసం మంత్రి పదవి కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు.

హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ కొత్త నాటకాలకు తెరతీస్తున్నారని అన్నారు.

కేసీఆర్ వి ప్రకటనలే తప్ప… కార్యాచరణ ఉండదని విమర్శించారు.

#Twitter : బాలల అశ్లీల కంటెంట్… కేసు నమోదు

0

నూతన ఐటీ విధానం విషయంలో కేంద్రంతో విభేదిస్తోన్న ట్విట్టర్ కు మరో చిక్కొచ్చిపడింది.

ట్విట్టర్ లో బాలల అశ్లీల కంటెంట్ (చైల్డ్ పోర్నోగ్రఫీ) ఉందంటూ ఎన్సీపీసీఆర్ (జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ ) ఫిర్యాదు చేసింది.

ఈ ఫిర్యాదును స్వీకరించిన ఢిల్లీ సైబర్ పోలీసులు ట్విట్టర్ పై కేసు నమోదు చేశారు.

వాస్తవానికి ట్విట్టర్ కు వ్యతిరేకంగా ఎన్సీపీసీఆర్ కొన్నిరోజుల కిందటే పలుమార్లు ఫిర్యాదు చేసింది.

అయినప్పటికీ ఢిల్లీ సైబర్ పోలీసులు స్పందించకపోవడంతో ఎన్సీపీసీఆర్ తాజాగా సమన్లు పంపింది.

ఈ నేపథ్యంలో, ట్విట్టర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు ఢిల్లీ సైబర్ సెల్ డీసీపీ అన్యేష్ రాయ్ వెల్లడించారు.

#Narappa #Venkatesh : సెన్సార్ పూర్తి చేసుకున్న ‘నారప్ప’

0

వెంకటేశ్ కథానాయకుడిగా ‘నారప్ప’ సినిమా రూపొందింది.

తమిళంలో ధనుశ్ హీరోగా చేసిన ‘అసురన్’ సినిమాకి ఇది రీమేక్. అక్కడ ఆ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది.

ధనుశ్ కెరియర్లోనే వైవిధ్యభరితమైన చిత్రంగా నిలిచింది. భారీ వసూళ్లతోపాటు ప్రశంసలను కూడా తెచ్చిపెట్టింది.

దాంతో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేశారు. సురేశ్ బాబు .. కలైపులి థాను ఈ సినిమాను నిర్మించారు.

తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డువారు ఈ సినిమాకి యు/ఎ సర్టిఫికెట్ ను మంజూరు చేశారు.

అసలు ఈ పాటికే ఈ సినిమా విడుదల కావలసింది. అయితే కరోనా వలన పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో విడుదల చేయలేదు.

ఇక ఈ సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వస్తుందనే టాక్ ఒక వైపున వినిపిస్తుంటే, లేదు థియేటర్లకే వస్తుందని మరికొంతమంది అంటున్నారు.

వెంకటేశ్ భార్య పాత్రలో ప్రియమణి నటించగా, ప్రకాశ్ రాజ్ .. సంపత్ రాజ్ .. మురళీశర్మ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.