Homeఆంధ్రప్రదేశ్ప్రాజెక్టుల నిర్మాణానికి అపెక్స్ కౌన్సిల్ అనుమతి అవసరం లేదా?

ప్రాజెక్టుల నిర్మాణానికి అపెక్స్ కౌన్సిల్ అనుమతి అవసరం లేదా?

తెలుగు రాష్ట్రాల తీరుపై కేంద్ర జల శక్తి శాఖ ఆక్షేపణ
కొత్త ప్రాజెక్టుల నిర్మాణం ఆపాలంటూ రెండు రాష్ట్రాలకు లేఖలు
నాలుగేళ్లుగా సమావేశం కాని అపెక్స్ కౌన్సిల్
ఈనెల 20 తర్వాత కౌన్సిల్ సమావేశం అయ్యే అవకాశం

రెండు తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా, గోదావరి బేసిన్ చాలా కీలకం. ఈ రెండు నదుల ద్వారానే రెండు తెలుగు రాష్ట్రాల్లో అధిక శాతం వ్యవసాయం సాగుతుంది. ప్రధాన నీటి పారుదల ప్రాజెక్టులు ఈ రెండు నదుల పైననే ఉన్నాయి. వీటికి తోడు కొత్తగా పలు నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మించేందుకు రెండు తెలుగు రాష్ట్రాలు ప్రణాళికలు రూపొందించాయి. రెండు తెలుగు రాష్ట్రాలు నిర్మించే పలు సాగు, తాగు నీటి ప్రాజెక్టులకు అపెక్స్ కౌన్సిల్ అనుమతి అవసరం లేదా.. అని కేంద్ర జల శక్తి శాఖ అధికారులు తెలుగు రాష్ట్రాలకు రాసిన లేఖలో తాజాగా ఆక్షేపించినట్లు సమాచారం. రాయలసీమకు తాగునీరు, సాగునీరు అందించేందుకు కృష్ణానదిపై రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ ఇటీవల పూర్తి చేసింది. దీనిపై తెలంగాణ తన ఆక్షేపణలను కృష్ణా ట్రిబ్యునల్ బోర్డుకి తెలియజేసింది. అదే విధంగా కేంద్ర జల శక్తి శాఖకు సైతం లేఖ రాసింది. మరోవైపు తెలంగాణలో నిర్మించే పలు ప్రాజెక్టులపై ఏపీ తన ఆక్షేపణ లను సైతం తెలియజేస్తూ లేఖలు రాసింది. ఇందులో కాళేశ్వరం మూడో టీఎంసీ ఎత్తిపోతలు, గోదావరి ఎత్తిపోతల మూడోదశ, సీతారామ ఎత్తిపోతల పథకం, తుపాకులగూడెం ప్రాజెక్ట్, తెలంగాణ తాగునీటి సరఫరా పథకం, రామప్ప లేక్ నుంచి పాకాల లేక్ మళ్లింపు పథకం, లోయర్ పెన్గంగ న దిపై బ్యారేజీలు తదితర పథకాలు ఉన్నాయి. ఏపీ ప్రయోజనాలకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం వీటిని నిర్మిస్తుందని కేంద్ర జల శక్తి, కృష్ణ, గోదావరి బోర్డులకు చేసిన ఫిర్యాదులో ఏపీ పేర్కొంది. రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పరం చేసుకున్న ఫిర్యాదులను సమీక్షించిన కేంద్ర జల శక్తి శాఖ తాజాగా అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగేంత వరకు కొత్త ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఆపాలంటూ తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలకు లేఖలు రాసింది. ఇదివరకే జరగాల్సిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఆగస్టు 20 తర్వాత కొత్త సమావేశం తేదీ నిర్ణయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అపెక్స్ కౌన్సిల్​లో పరస్పర అనుమతితో ప్రాజెక్టుల నిర్మాణం ముందుకు సాగే అవకాశం ఉన్నట్టు నీటిపారుదల శాఖ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం కొత్త పథకం కాదని దీనికి కొత్తగా పర్యావరణ అనుమతి అక్కర్లేదని కేంద్ర అటవీ పర్యావరణ కమిటీ స్పష్టీకరించడం ఏపీకి ఊరట కలిగిస్తుంది.

Recent

- Advertisment -spot_img